చాలా వరకు ఆహార పదార్థాలను పచ్చిగా తింటే వాటిని పొట్టుతోనే తినమని వైద్యులు చెబుతారు. ఎందుకంటే పొట్టు ద్వారానే మనకు కావల్సిన కీలక పోషకాలు లభిస్తాయి కనుక. కానీ… బాదం పప్పును మాత్రం పొట్టు లేకుండానే తినాలట..! అవును మీరు విన్నది కరెక్టే..! దీంతోపాటు ఆ పప్పును నానబెట్టి తింటే ఇంకా మంచిదని వైద్యులు చెబుతున్నారు. మరి ఇలా ఎందుకు తినాలో, అసలు దీని వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
బాదంపప్పు పొట్టులో పలు రకాల ఎంజైమ్‌లు ఉంటాయి. ఈ క్రమంలో బాదం పప్పును అలాగే తింటే దాంతో వాటికి ఉన్న పొట్టు కూడా మన జీర్ణాశయంలోకి వెళ్తుంది. అప్పుడు ఆ పొట్టు బాదం పప్పును ఆక్రమిస్తుంది. అలాంటప్పుడు బాదం పప్పు సరిగ్గా జీర్ణం కాదు. దీనికి తోడు ఆ పప్పులో ఉండే పోషకాలు మన శరీరంలోకి చేరవు. జీర్ణం సరిగ్గా కాకపోవడం వల్ల గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి.
అయితే అలా కాకుండా బాదం పప్పును కనీసం 8 గంటల పాటు నానబెడితే దాంతో వాటి పొట్టు సులభంగా వస్తుంది. అప్పుడు ఎంచక్కా వాటిని తినవచ్చు. అలా నీటిలో నానబెట్టడం వల్ల బాదం పప్పు చాలా సాఫ్ట్‌గా మారుతుంది. దీంతో అలాంటి పప్పును తింటే అది తేలిగ్గా జీర్ణమవడమే కాదు, దాని ద్వారా మనకు మిక్కిలిగా పోషకాలు అందుతాయి. ఈ విషయాన్ని పలు పరిశోధనలు కూడా ధృవీకరించాయి. కనుక… ఇక ముందు మీరు బాదం పప్పును తినాలనుకుంటే వాటిని కనీసం 8 గంటల పాటు నీటిలో నానబెట్టి తినడం మంచిది. ఇలా తినడం వల్ల పిల్లలు, వృద్ధులకు కూడా బాదం పప్పు తేలిగ్గా అరుగుతుంది.