ఇప్పుడంటే మనం రక రకాల డిజైన్లు, వెరైటీలతో కూడిన చెప్పులు, శాండిల్స్, షూస్‌ను ధరిస్తున్నాం. కానీ ఒకప్పుడు ఇవేవీ లేవుగా, అప్పుడు మరి జనాలు ఏం తొడుక్కునే వారు..? అంటే… పాదుకలు. అవును అవే. చాలా మంది వాటినే తొడిగే వారు. ప్రధానంగా రుషులు, సన్యాసులు అయితే పాదుకలనే పాదరక్షలుగా వేసుకునేవారు. ఇప్పటికీ కొందరు స్వాములు అలాగే వేసుకుంటున్నారు కూడా. అయితే అప్పట్లో జంతు చర్మాలతో చేసిన చెప్పులు కూడా చలామణీలో ఉండేవి. మరి, వాటిని కాదని రుషులు కేవలం పాదుకలనే ఎందుకు వేసుకునే వారో తెలుసా..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
జంతు చర్మంతో చేసిన చెప్పులు వేసుకుంటే అపచారం చేసినట్టవుతుందని అప్పట్లో రుషులు భావించేవారు. అందుకే వారు చెక్కతో చేసిన పాదుకలు వేసుకునే వారు. అప్పట్లో సన్యాసులు ఎక్కువగా అరణ్యాల్లో ఉండేవారు. దీంతో అలాంటి ప్రదేశాల్లో సంచరించేందుకు పాదుకలే అనువుగా ఉండేవి. అందుకే వాటినే రుషులు ధరించేవారు. ఇక చలికాలం, ఎండాకాలంలలో చెక్కతో చేసిన పాదుకలే సన్యాసుల పాదాలకు ఆహ్లాదాన్నిచ్చేవి. అందుకే వాటిని వారు వేసుకునేవారు. వర్షాకాలంలో వేసుకునేందుకు వీలుగా పాదుకల మధ్యలో రంధ్రాలు కూడా ఏర్పాటు చేసుకునేవారు. దీంతో పాదుకలకు, పాదాలకు మధ్య నీరు నిల్వ ఉండదు. రంధ్రాల్లో గుండా బయటకు వెళ్తుంది.
ఇతర వేరే ఏ పదార్థం ఉపయోగించి చేసినా చెక్కతో చేసిన పాదుకలే అప్పట్లో ఖరీదు తక్కువగా ఉండేవి. అందుకే చాలా మంది వాటిని వాడేవారు. పర్వత ప్రాంతాల్లో నడిచే వారికి పాదుకలే అనువుగా ఉంటాయి. అందుకే అప్పట్లో చాలా మంది పాదుకలనే ధరించేవారు.