పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ కీలక పాత్రలో నటించిన హరిహర వీరమల్లు మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ బాగుందని కొందరు అంటుంటే, బాగా లేదని మరి కొందరు అంటున్నారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మాత్రం ఈ మూవీ బాగా నచ్చేసింది. ఏపీలో ప్రతిపక్ష వైసీపీ నాయకులు మాత్రం ఈ మూవీపై విమర్శలు కురిపిస్తున్నారు. దీన్ని జనసేన నాయకులు సమర్థవంతంగా తిప్పి కొడుతున్నారు. మూవీ చాలా బాగుందని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్ల వివరాలను ట్రేడ్ వర్గాలు తాజాగా వెల్లడించాయి.
పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హరి హర వీరమల్లు నాలుగు రోజుల్లో రూ.105 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. మొత్తంగా 51 శాతం రికవరీ చేసిందని వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.78.30 కోట్లు రాబట్టడం విశేషం. బ్రేక్ ఈవెన్ రావాలంటే ఇంకా రూ.62.48 కోట్ల కలెక్షన్లు రాబట్టాలని అంచనా వేస్తున్నారు.
జూలై 24న రిలీజైన హరిహర వీరమల్లు మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఈ మూవీపై అటు వైసీపీ, ఇటు జనసేన వర్గీయుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హరిహర వీరమల్లు మూవీ బాగుందని జనసేన వర్గీయులు ఈ మూవీని ఆకాశానికెత్తేస్తున్నారు. మరోవైపు వైసీపీ మాత్రం విమర్శిస్తోంది. ఇక ఈ మూవీ ఫలితం ఎలా ఉంటుందో మరి కొద్ది రోజుల్లో తేలనుంది.