ప్రస్తుత తరుణంలో మనం తినే చాలా వరకు ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారు. అదీ ఇదీ అని తేడా లేకుండా అన్ని వస్తువులు కల్తీమయం అవుతున్నాయి. కల్తీ అనేది సాధారణంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా కొందరు అక్రమార్కులు డబ్బు యావతో కల్తీ చేయడం ఆపడం లేదు. అధికారులు సైతం ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ కల్తీలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు వ్యాపారులు నూతన తరహాలో ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారు. ఇప్పటికే కల్తీ పాలు, పెరుగు, నెయ్యి, తేనె, టీ పొడి వంటివి అనేకం కల్తీ అయ్యాయి. ప్రస్తుతం గోధుమ పిండిని కూడా కల్తీ చేస్తున్నారు. పండుగల సీజన్‌లో పిండి వంటలు అధికంగా చేస్తారు కనుక ఆ సమయంలో గోధుమ పిండి కల్తీ మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులే చెబుతున్నారు. ఈ క్రమంలోనే కల్తీ గోధుమ పిండిని గుర్తించి జాగ్రత్తగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.
మనం ఇంట్లో వాడుతున్న గోధుమ పిండి స్వచ్ఛమైందేనా, కల్తీ జరిగిందా.. అన్న విషయం గుర్తించడం చాలా కష్టమే. కానీ ఇందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే మీరు వాడుతున్న గోధుమ పిండిలో కల్తీ జరిగిందా, లేదా అన్న విషయాన్ని ఇట్టే పసిగట్టవచ్చు. ఇందుకు గాను ల్యాబ్‌కు వెళ్లాల్సిన పనిలేదు. కొన్ని సులభతరమైన సూచనలు పాటిస్తే గోధుమ పిండిలో కల్తీ అయిందా లేదా అన్న విషయాన్ని గుర్తించవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్వచ్ఛమైన గోధుమ పిండి తాజాగా ఉన్న వాసన రావడంతోపాటు తియ్యగా కూడా ఉంటుంది. అలా కాకుండా పాత లేదా ఘాటైన వాసన వస్తుంటే ఆ పిండిలో కల్తీ జరిగిందని గుర్తించాలి. రుచి కూడా తియ్యగా కాకుండా వేరే రకంగా ఉంటే అలాంటి పిండిలో కల్తీ జరిగిందని అర్థం చేసుకోవాలి. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా గోధుమ పిండిని వేస్తే స్వచ్ఛమైన పిండి అయితే నీటిలో బాగా కలిసి అడుగు భాగంలో చేరుతుంది. అలా జరగకపోతే పిండి కల్తీ అయిందని గుర్తించాలి. ఒక పేపర్‌పై గోధుమ పిండిని వేసి కాల్చాలి. స్వచ్ఛమైన పిండి అయితే మట్టి వాసన వస్తుంది. ఘాటైన వాసన వస్తే పిండిలో కల్తీ అయినట్లు తెలుసుకోవాలి. ఇలా పలు చిట్కాలను పాటిస్తే గోధుమ పిండి కల్తీ అయిందీ లేనిదీ ఇట్టే తెలుసుకోవచ్చు.