అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు వచ్చిన పాత్ర వారు కాదనడంతో మరొకరి వద్దకు వెళుతుంది. అది సూపర్ హిట్ అయితే అది వద్దనుకున్న నటులు ఫీలైన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కన్నడ నటి ప్రేమ కూడా ఆ పాత్రను వదులుకొని చాలా బాధపడిందట.
తెలుగు ఇండస్ట్రీలో దేవి సహా పలు హిట్ చిత్రాలు నటించిన ప్రేమ ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలు బయట పెట్టింది. సూపర్ హిట్ చిత్రం అరుంధతి సినిమాలో అరుంధతి పాత్రకు ముందు తనని అడిగారట. ఈ చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ ప్రేమను దేవి సినిమాతో తెలుగులో పరిచయం చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అరుంధతి చిత్రంలో జేజమ్మ పాత్రకు కూడా ఆయన మొదట తనని అడిగారని, ఆ టైంలో కన్నడ చిత్రాలలో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీ కోసం డేట్ ఇవ్వలేకపోయానని ప్రేమ తెలియజేసింది.
ఆ తర్వాత అరుంధతి మూవీ చూశానని , బాగా నచ్చిందని, అనుష్క కూడా ఈ చిత్రంలో చక్కగా నటించిందని తెలియజేసింది. కొన్ని పాత్రల మీద అవి చేయాల్సిన నటుల పేర్లు రాసి ఉంటాయని అలాగే అరుంధతి పాత్ర కూడా అనుష్కకు రాసిపెట్టి ఉంది. కాబట్టి ఆమెనే వరించిందని తెలియజేసింది. ఈ సినిమా చేయనందుకు కాస్త బాధనిపించిందని చెప్పింది.