లాటిన్ భాషలో క్రిస్ట్ (Christ) అనగా క్రీస్తు, మాస్ (Mass) అనగా ఆరాధన. క్రీస్తుని ఆరాధించి ఆయనను కీర్తిస్తూ ఆనందించుటయే క్రిస్ట్మస్. యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. క్రీస్తు జననం వెనుక కొన్ని అద్భుతాలు దాగున్నాయి. రోమా సామ్రాజ్యాన్ని ఆగస్టస్ సీజర్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన తన రాజ్యంలో ఎంత మంది ప్రజలు ఉన్నారో లెక్కవేయించాలనుకున్నాడు. అందుకు వీలుగా ప్రజలందరు ఎవరి స్వగ్రామాలకు వాళ్ళు డిసెంబరు 25 తేదీలోగా వెళ్ళాలని ఆజ్ఞాపించాడు. అప్పుడు నజరేతు అనే పట్టణంలో మేరీ, జోసఫ్ అనే వాళ్ళు నివసిస్తున్నారు. అప్పటికే మేరీకి జోసెఫ్‌తో పెళ్ళికుదిరింది. ఇదిలా ఉండగా ఒక రోజున మేరీకి గాబ్రియేల్ అనే దేవదూత కనబడి ఓ మేరీ! నీవు దేవుని వలన అనుగ్రహం పొందావు. నీవు కన్యగానే గర్భవతివి అవుతావు. నీవు ఒక కుమారుని కంటావు. అతనికి యేసు అని పేరు పెట్టు. అతడు దేవుని కుమారుడు అని చెప్పి మాయం అవుతాడు. తర్వాత మేరీ గర్భవతి అవుతుంది.
ఇది తెలిసి జోసెఫ్ ఆమెను పెళ్లి చేసుకోకూడదని అనుకుంటాడు….అయితే ఒక రాత్రి కలలో అతనికి దేవదూత కనపడి మేరీని నీవు విడిచిపెట్టొద్దు….ఆమె దేవుని వరం వలన గర్భవతి అయింది. ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు. తనను నమ్మిన ప్రజలందరిని వాళ్ళ పాపాల నుండి కాపాడే లోక రక్షకుడతను.. అని చెప్పి అదృశ్యమవుతాడు. తర్వాత జోసెఫ్ మేరిని పెళ్లి చేసుకుంటాడు. జోసఫ్ స్వగ్రామం బెత్లేహం. అందుచేత వాళ్ళు రాజాజ్ఞను అనుసరించి బెత్లేహేముకు బయలుదేరారు. తీరా వాళ్ళు బెత్లేహేము చేరుకునే సరికి వాళ్ళకక్కడ ఉండటానికి వసతి దొరకలేదు. చివరకు ఒక సత్రపు యజమాని తన పశువుల పాకలో ఉండనిచ్చాడు. అక్కడే మేరీ ఒక శిశువుకు జన్మనిస్తుంది.
ఆ రాత్రి బెత్లేహం పొలాల్లో కొందరు పశువుల కాపరులు తమ గొర్రెల మందలను కాపలా కాస్తుండగా…. ఓ దేవదూత ఆకాశం నుంచి వారి ముందుకు దిగి వచ్చి, మీకొక సంతోషకరమైన శుభవార్త తీసుకొచ్చాను… ఇవ్వాళ బెత్లెహేములోని ఒక పశువులపాకలో, లోక రక్షకుడు పుట్టాడు. ఆయనే అందరికీ ప్రభువు. ఒక పసికందు పొత్తిగుడ్డల్లో చుట్టబడి, పశువుల తొట్టిలో పండుకొని ఉంటాడు. ఇదే మీకు గుర్తు. అతడే లోకరక్షకుడు అని చెబుతాడు అంతర్థానమవుతాడు. ఇది విన్న గొర్రెల కాపరులు హుటాహుటిన వెళ్ళి దేవదూత చెప్పిన పశువుల పాకను చేరుకున్నారు. అక్కడ పశువుల తొట్టిలో పడుకొని ఉన్న శిశువును, మేరీ, జోసెఫ్ లను చూశారు. వారు తాము చూచింది, దేవదూత తమకు చెప్పింది అందరికి తెలియజేశారు. అలా రెండు వేల సంవత్సరాల క్రిందట డిసెంబరు 24వ తేదీ అర్థరాత్రి యేసు క్రీస్తు జన్మించాడు. అందుచేత ఆ మరునాడు అంటే డిసెంబరు 25వ తేదీ క్రిస్మస్ పండుగ.