దేవాలయంలో అయినా, ఇంట్లో అయినా పూజ పూర్తయ్యాక హారతి ఇస్తాం. అలాగే కొత్త పెళ్లికూతురిని ఆహ్వానించడానికి హారతి ఇస్తాం. కొన్ని సందర్భాల్లో ప్రత్యేక అతిథులను, గొప్పవాళ్లను కూడా హారతి ఇచ్చి స్వాగతం పలుకుతాం. దేవాలయానికి వెళ్లినప్పుడు హారతి తప్పనిసరిగా కళ్లకు అద్దుకుంటాం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న హారతి ఎందుకు ఇస్తారో ఒక్కసారైనా ఆలోచించారా ? హారతి ఇవ్వాల్సిన అవసరమేంటో తెలుసా ? హారతి సమయంలో దేవుడి ప్రతి భాగము మీద మనసు పెట్టి ఆయన రూపాన్ని దీపపు వెలుగులో చూసే దివ్యమైన అవకాశం పొందడానికే ఈ హారతి ఇచ్చే సంప్రదాయం తీసుకొచ్చారు.
అలాగే హారతి సమయంలో గంట కొట్టడం వల్ల చుట్టు పక్కల ఉన్నవాళ్లు ఆ శబ్ధం ద్వారా హారతి ఇస్తున్నారని గ్రహించి దేవుడి దర్శనానికి రావాల్సిందని ఆహ్వానించినట్టు. అలాగే హారతి ఇచ్చే సమయంలో మనకు తెలియకుండా.. మన మనసు ఆధ్యాత్మిక భావనలోకి వెళ్తుంది. కళ్లకు హారతి అద్దుకుంటూ అజ్ఞాన అంధకారాన్ని తొలగించి, జ్ఞాన ప్రకాశాన్ని కలిగించమని ఆ భగవంతుడిని ప్రార్థించాలి. సూర్యుడిలోని జ్యోతి, పరామాత్మలోని జ్యోతి, మన కళ్లలో ఉండే జ్యోతి ఒక్కటే అని ఈ హారతి వివరిస్తుంది.
కర్పూర హారతి ఎలా కరిగిపోతుందో, మనం తెలిసీ తెలియక చేసిన తప్పులు అలాగే కరిగిపోవాలని వేడుకుంటూ హారతిని కళ్లకు అద్దుకోవడమే ఇందులోని అర్థం.. పరమార్థం. ఆ దేవుడి దర్శన భాగ్యాన్ని కలిగించే హారతి చాలా పవిత్రమైనది. అలాగే హారతికి కర్పూరం ఉపయోగించడం వెనక కొన్ని ఆరోగ్యకరమైన కారణాలున్నాయి. కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం వల్ల సూక్ష్మక్రిములు నశిస్తాయి. శ్వాస సంబంధ వ్యాధులు, అంటు వ్యాధులు దూరంగా ఉంటాయి.