ఆలయాల్లో, ఇంట్లో పూజ చేసే సమయంలో చాలామంది సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు. అయితే పురుషులు మాత్రమే చేయాలని, మహిళలు చేయకూడదని పండితులు చెబుతారు. ఇందుకు కారణమేంటే.. సాష్టాంగ అంటే 8 అంగాలతో నమస్కారం చేయడం అర్థం. మనిషి సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయాల్లో బోర్లా పడుకుని ఆ అంగాలతో చేసిన తప్పులను క్షమించమని వేడుకుంటారు.
ఉరస్సుతో నమస్కారం చేసేటపుడు ఛాతి, శిరస్సుతో నమస్కారం చేసేటపుడు నుదురు, దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని తలుచుకోవాలి. మనస్పూర్తిగా మనస్సుతో నమస్కారం చేయాలి. వచసా నమస్కారం అంటే ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి. పద్భ్యాం నమస్కారం అంటే రెండు పాదాలు నేలకు, కరాభ్యాం నమస్కారం అంటే రెండు చేతులు, జానుభ్యాం నమస్కారం అంటే రెండు మోకాళ్ళు నేలకు తగులుతూ నమస్కారం చేయాలని పురాణాలు చెబుతున్నాయి.
స్త్రీలు కేవలం పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చేయాలని శాస్త్రం చెబుతోంది. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయాలంటే పొట్ట నేలకు తాకుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. పాలిచ్చి పోషించే వక్ష స్థలం కూడా నేలకు తాకుతాయి. ఇలా చేయడం వల్ల ఏదైనా జరగరానిది జరిగే అవకాశం ఉంది. మన శాస్త్రాల్లో స్త్రీకి గొప్ప విలువ ఉంటుంది. సృష్టికి ఆధారమైన, పోషణకు ఆధారమైన స్థలం నేలకి తాకకూడదు. అందుకే స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయరాదు.