మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు సరిగ్గా నీటిని తీసుకోకపోవడమే కారణమని నిపుణులు చెబుతుంటారు. అయితే అనివార్యంగా ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీరు తాగాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది.. మనలో దాదాపు ప్రతీ ఒక్కరూ ప్లాస్టిక్ బాటిల్‌లోనే నీటిని తాగుతారు. అయితే ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీరు తాగడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. శరీరంలోకి ప్లాస్టిక్ అవశేషాలు వెళ్లడానికి ప్రధాన కారణాల్లో ఈ బాటిల్స్‌లో నీరు తాగడం ఒక కారణమని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. దీంతో ఆరోగ్యంపై అవగాహన ఉన్న వారు ఎవరైనా ప్లాస్టిక్ బాటిల్స్‌ను నీటిని తాగేందుకు ఆసక్తి చూపించరు.
వీటికి బదులుగా రాగి లేదా స్టీల్ బాటిల్స్‌ను ఉపయోగిస్తారు. అయితే ఈ రెండింటి మధ్య తేడా ఏంటనే సందేహం రావడం సర్వసాధరణం. మరి ఈ రెండింటిలో ఏ బాటిల్‌లో నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.? మరి ఈ రెండింట్లో ఏది బెటర్ అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. రాగి పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పూర్వం ఎక్కువ మంది రాగి పాత్రలనే ఉపయోగించేవారు. నీటి కొలనుల్లో రాగి నాణేలను వేసే సంప్రదాయం కూడా ఇలాగే వచ్చింది. రాగి పాత్రల్లో నీటిని నిల్వచేయడం వల్ల ఈ ఖనిజం నీటిలో స్వల్ప స్థాయిలో కలుస్తుంది. దీంతో, రాగి పాత్రల్లోని నీరు అద్భుత ఔషధ గుణాలు సంతరించుకుంటాయని నిపుణులు సైతం చెబుతుంటారు.
రాగికి సూక్ష్మక్రిములను నిర్వీర్యం చేసే శక్తి ఉంటుంది. రాగి పాత్రల్లో నీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ బలోపేతమవుతుంది. పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది. థైరాయిడ్ గ్రంధి పనితీరును మెరుగుపరచడంలో కూడా రాగి ఎంతో ఉపయోగపడుతుంది. హార్మోన్ల సమతౌల్యత కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో కూడా రాగి పాత్రలో నీరు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రాగి పాత్రల్లోని నీరు ఫ్రీరాడికల్స్‌ను నిర్వీర్యం చేసే శక్తి ఉంటుంది. మెదడు పనితీరును కీలకమైన న్యూరోట్రాన్స్‌మిటర్ల తయారీలో రాగి ఉపయోగపడుతుంది. ఇటీవల స్టీల్ బాటిల్స్‌ను కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే రాగి బాటిల్స్‌తో ఉన్నన్ని లాభాలు స్టీల్ బాటిల్స్‌తో ఉండవు. కానీ స్టెయిన్‌లెస్ స్టీల్ నీటిపై ఎలాంటి ప్రభావం చూపదు. అందుకే ఇందులో నిల్వ ఉంచిన నీరు ఎక్కువ కాలం శుభ్రంగా ఉంటుంది. స్టీల్ పాత్రలు తుప్పు పట్టవు. కాబట్టి ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. ఈ బాటిల్‌లో నీరు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సేపు నిల్వ ఉంటాయి.
రాగి, స్టీల్ బాటిల్ రెండింటిలోనూ విభిన్నమైన లాభాలు ఉన్నాయి. అయితే స్టీల్‌తో పోల్చితే రాగి బాటిల్స్ ధర ఎక్కువగా ఉంటుంది. అలాగే రాగి బాటిల్స్‌ను తరచూ శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇవి త్వరగా రంగు మారుతాయి. అయితే రాగి పాత్రలో నీటిని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. స్టీల్ బాటిల్‌లో అలాంటి ప్రయోజనాలు లేకపోయినప్పటికీ.. ప్లాస్టిక్ బాటిల్‌తో పోల్చితే చాలా మంచిదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.