పాత చింతకాయ పచ్చడి అని అందరూ కొట్టి పారేస్తారు కానీ… వాస్తవంగా చెప్పాలంటే… ఓల్డ్ ఈజ్ గోల్డే. ఎందుకంటే పెద్దలు మనకు చెప్పే మాటలు, వారు ఆచరించే విధానాలు అన్నీ మనకు అనుసరనీయమే. కానీ నేటి తరుణంలో అందరూ పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోయి ఒకప్పుడు మన పెద్దలు చెప్పిన మాటలను పట్టించుకోవడం లేదు. పెడ చెవిన పెడుతున్నారు. ఈ క్రమంలో మరో వైపు ఫారినర్లు మాత్రం ఒకప్పటి మన పద్ధతులను పాటిస్తూ సాంప్రదాయ విధానాలను అనుసరిస్తున్నారు. అందులో పళ్లు తోముకోవడం కూడా ఒకటి. మనం టూత్‌పేస్ట్, పళ్లపొడి అంటూ పరుగులు పెడుతున్నాం కానీ… విదేశీయులు ఇప్పుడు వేటితో తమ దంతాలు శుభ్రం చేసుకుంటున్నారో తెలుసా..? బొగ్గు, పసుపు..! అవును, అవే.
కర్రను కాల్చగా వచ్చిన బొగ్గు లేదా ఆవు పిడకలను కాల్చగా వచ్చిన కచ్చిక అనే బూడిద పొడిని ప్రస్తుతం విదేశీయులు పళ్లపొడిగా ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు పసుపును కూడా వారు అందుకు విరివిగా వాడుతున్నారు. ఇంతకీ వారు వాటితో పళ్లు ఎలా తోముకుంటున్నారో తెలుసా..? పసుపు అయితే ముందుగా దాన్ని ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకుని నీరు కలిపి పేస్ట్‌లా చేస్తారు. దాంతో పళ్లు తోముకుంటారు. అయితే వెంటనే నోరు కడగరు. 3 నుంచి 5 నిమిషాల పాటు ఆగాక నోరు కడుక్కుని మళ్లీ టూత్‌పేస్ట్‌తో దంత ధావనం ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. దీంతో కేవలం కొద్ది రోజుల్లోనే దంతాల్లో చాలా మార్పు వస్తుందని అంటున్నారు.
పసుపును ఉపయోగించినట్టుగానే వారు బొగ్గు, కచ్చికలతో కూడా అదే విధంగా దంతాలను తోముకుంటున్నారట. దీన్ని బట్టి చూస్తే విదేశీయులు మన పద్ధతులను ఏ విధంగా అనుసరిస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. కానీ మనం మాత్రం ఇంకా పాశ్చాత్య ధోరణిని విడిచి పెట్టడం లేదు. అయితే పైన చెప్పిన విధంగానే కాక పసుపుతో ఈ విధంగా కూడా దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. అదెలాగంటే…
నాలుగు టేబుల్ స్పూన్ల పసుపు, 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, రెండున్నర టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలను కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దాంతో దంతాలను 2 నుంచి 3 నిమిషాల పాటు తోమాలి. అనంతరం 2 నిమిషాలు అలాగే ఉండి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా దంతాలు మెరుస్తాయి. నోటి సమస్యలు పోతాయి.