టూత్‌పేస్ట్‌ను మీరు ఏ విధంగా వాడతారు? ఏ విధంగా వాడడమేమిటి? ఎవరైనా దాంతో దంతాలనే శుభ్రం చేసుకుంటారంటారు కదా, అంటారా. అయితే మీరు కరెక్టే చెప్పారు. కానీ టూత్‌పేస్ట్‌తో ఇంకా కొన్ని పనులు కూడా చేయవచ్చట. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బాగా మురికి పట్టిపోయిన షూస్‌పై కొంత టూత్‌పేస్ట్‌ను పై పూతగా రాసి అనంతరం వాడి పడేసిన పాత టూత్ బ్రష్‌తో బాగా రుద్దాలి. దీంతో షూస్‌పై ఉన్న మురికంతా పోతుంది. అనంతరం తడి బట్టతో శుభ్రంగ తుడవాలి. ఇలా చేయడం వల్ల షూస్ తళతళా మెరుస్తాయి. పురుగులు కుట్టిన చోట దురదగా అనిపించడం సహజమే. అయితే దాన్ని తగ్గించడమెలా అంటే ఏం లేదు, సింపుల్‌గా కొంచెం టూత్‌పేస్ట్‌ను సదరు ప్రదేశంలో రాస్తే చాలు. దురద ఇట్టే తగ్గిపోతుంది. దీనికి తోడు ఆ ప్రాంతమంతా చల్లగా, హాయిగా అనిపిస్తుంది.
ఎంత జాగ్రత్తగా తాగినా ఒక్కోసారి కాఫీ, టీ మరకలు దుస్తులపై పడుతుంటాయి. ఈ క్రమంలో కొద్దిగా టూత్‌పేస్ట్‌ను ఆ మరకలపై రాసి పాత టూత్ బ్రష్‌తో రుద్ది అనంతరం ఆ దుస్తులను ఉతికితే చాలు, ఆ మరకలు ఇట్టే వదిలిపోతాయి. బాత్‌రూమ్, కిచెన్ లలో స్టీల్ ట్యాప్‌లు తుప్పు పడితే వాటిపై కొద్దిగా టూత్‌పేస్ట్‌ను రాసి తుడవాలి. అంతే, వెంటనే తుప్పు వదిలిపోయి అవి ఎప్పటిలాగే మెరుస్తాయి. చేతివేళ్లు, గోర్లకు అందాన్ని తేవడంలోనూ టూత్‌పేస్ట్ బాగానే పనిచేస్తుంది. నెయిల్ బఫర్‌ను తీసుకుని దానికి కొద్దిగా టూత్‌పేస్ట్‌ను రాయాలి. అనంతరం ఆ బఫర్ సహాయంతో గోర్లపై రాస్తే అవి మృదువుగా మారుతాయి. దీంతో చేతి వేళ్లకు అందం వస్తుంది. నేటి తరుణంలో స్మార్ట్‌ఫోన్లను ప్రతి ఒక్కరు పడుతున్నారు. అయితే అందరూ కామన్‌గా ఇబ్బందులు పడేది ఆ ఫోన్ స్క్రీన్ విషయంలోనే. ఒక్క చిన్న గీత డివైస్ తెరపై పడినా మనస్సుకు చివుక్కుమనిస్తుంది. అయితే టూత్‌పేస్ట్ ఆ సమస్యకు పరిష్కారం చెబుతోంది. కొద్దిగా టూత్‌పేస్ట్‌ను స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ అంతటా రాసి అనంతరం గ్లాస్ క్లీనింగ్ లిక్విడ్‌తో శుభ్రం చేయాలి. దీంతో స్క్రీన్‌పై పడిన గీతలు తొలగిపోతాయి.
మొటిమలను తొలగించుకోవడానికి సింపుల్ మెథడ్ ఏంటో తెలుసా? అదే టూత్‌పేస్ట్‌ను వాడడం. కొద్దిగా టూత్‌పేస్ట్‌ను తీసుకుని మొటిమపై రాయాలి. రాత్రంతా దాన్నంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే వచ్చే మార్పును మీరు గమనిస్తారు. వజ్రపు ఉంగరాలను శుభ్రం చేయడంలోనూ టూత్‌పేస్ట్ బాగానే పనిచేస్తుంది. మెత్తని బ్రిజిల్స్ ఉన్న బ్రష్‌తో టూత్‌పేస్ట్‌ను ఉంగరంపై రాస్తూ దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు. పైన చెప్పిన ట్యాప్‌ల మాదిరిగానే ఇంట్లో ఉన్న స్టీల్ ప్లేట్లు, స్పూన్లు, ఫోర్క్‌లను టూత్‌పేస్ట్‌తో సులభంగా క్లీన్ చేసుకోవచ్చు. దుస్తులపై పడ్డ వివిధ రకాల మరకలను కూడా టూత్‌పేస్ట్‌తో తొలగించుకోవచ్చు. సంబంధిత ప్రదేశంపై కొద్దిగా టూత్‌పేస్ట్ రాసి ఉతికితే చాలు, ఆ మరకలు ఇట్టే పోతాయి. వాహనాల హెడ్‌లైట్లపై టూత్‌పేస్ట్‌ను రాసి దానిపై పాత టూత్ బ్రష్‌తో రుద్దుతూ శుభ్రం చేస్తే లైట్లు మెరుస్తాయి.
దుస్తులను ఇస్త్రీ చేసే సమయంలో ఐరన్ బాక్స్ వల్ల పడిన మరకలను కూడా టూత్‌పేస్ట్‌తో శుభ్రంగా తొలగించుకోవచ్చు. కొద్దిగా టూత్‌పేస్ట్‌ను అలాంటి మరకలపై రాసి క్లీన్ చేస్తే చాలు. దుస్తులు ఎప్పటిలాగే మారుతాయి. చిన్నారులు గోడలపై కలర్ పెన్సిల్స్, క్రేయాన్స్‌తో గీసే గీతలను తొలగించాలంటే టూత్‌పేస్ట్‌ను వాడాలి. ఆయా గీతలపై టూత్‌పేస్ట్‌ను రాసి బాగా తుడిస్తే చాలు, వెంటనే ఆ గీతలు పోతాయి. ఇంట్లో నేలపై పరిచే కార్పెట్లను కూడా టూత్‌పేస్ట్‌తో సులభంగా శుభ్రం చేయవచ్చు. ఫొటో ఫ్రేమ్‌లు, పెయింటింగ్ ఫ్రేమ్‌ల వెనుక ఉండే మేకుల రంధ్రాల్లో టూత్‌పేస్ట్‌ను వేసి గోడకు అతికిస్తే అవి సులభంగా అక్కడ ఇమిడిపోతాయి. అనంతరం ఎప్పుడైనా ఆయా ఫ్రేమ్‌లను అక్కడి నుంచి తీసేసినా ఆ ప్రదేశంలో ఎలాంటి ముద్రలు కనిపించవు.