క్యాన్సర్.. ఈ పేరు వింటేనే చాలా మంది గుండెల్లో దడ పుడుతుంది. మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఈ మహమ్మారి, కొన్ని జంతువులలో మాత్రం చాలా అరుదుగా వస్తుంది. అందులో ఒకటి భూమ్మీద అతిపెద్ద క్షీరదం అయిన ఏనుగు. ఇంత పెద్ద శరీరంతో ఎక్కువ కాలం జీవించే ఏనుగులకు క్యాన్సర్ ఎందుకు రాదు అనేది శాస్త్రవేత్తలను ఎప్పటినుంచో ఆకర్షిస్తున్న ప్రశ్న. దీనికి కారణం P53 అనే ఒక ప్రత్యేక జన్యువే అని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ పరిశోధనలు మానవుల్లో క్యాన్సర్ చికిత్సకు కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి.
సాధారణంగా, మానవులలో ఈ P53 జన్యువు ఒక కాపీ మాత్రమే ఉంటుంది. దీనిని ట్యూమర్ సప్రెసర్ జీన్ లేదా జీనోమ్ గార్డియన్ అని పిలుస్తారు. అంటే, ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. అయితే, ఏనుగులలో ఈ P53 జన్యువు కాపీలు ఏకంగా 20 వరకు ఉంటాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇదే ఏనుగులకు క్యాన్సర్ రాకుండా కాపాడుతుందని వారు చెబుతున్నారు.
ఈ P53 జన్యువులు, DNA దెబ్బతిన్నప్పుడు కణ విభజనను వెంటనే ఆపేస్తాయి. క్యాన్సర్ కణాలు పెరగకుండా నియంత్రిస్తాయి. దెబ్బతిన్న లేదా ప్రమాదకరమైన కణాలు క్యాన్సర్‌గా మారకముందే అవి స్వయంగా నశించిపోయేలా (సెల్ఫ్-డిస్ట్రక్ట్ లేదా అపోప్టోసిస్) చేస్తాయి. మానవులలో ఈ జన్యువు ఒక్క కాపీ మాత్రమే ఉండటం వల్ల, కొన్నిసార్లు దెబ్బతిన్న కణాలను ఇది నియంత్రించలేకపోవచ్చు. కానీ ఏనుగులలో ఈ 20 కాపీలు కలిసికట్టుగా పనిచేసి, కణాల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తాయి. ఏ మాత్రం తేడా వచ్చినా, వెంటనే చర్యలు తీసుకుంటాయి.
సాధారణంగా శరీరంలో కణాల సంఖ్య పెరిగే కొద్దీ, క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉండాలి. ఈ సిద్ధాంతాన్ని పీటోస్ పారడాక్స్ (Petos Paradox) అంటారు. కానీ ఏనుగులు, తిమింగలాలు వంటి పెద్ద జంతువులకు ఇది వర్తించదు. ఈ అద్భుతమైన క్యాన్సర్ నిరోధక శక్తి వెనుక P53 జన్యువులే కీలక పాత్ర పోషిస్తున్నాయని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఏనుగులలో P53 జన్యువులు ఎలా పనిచేస్తాయి అనే దానిపై లోతైన అధ్యయనాలు చేయడం ద్వారా, మానవులలో క్యాన్సర్ చికిత్సకు, నివారణకు కొత్త మార్గాలను కనుగొనవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ పరిశోధనలు క్యాన్సర్‌కు ఒక విప్లవాత్మక పరిష్కారాన్ని చూపవచ్చు.