బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అనే వ్యాధి కూడా గుండెకు సంబంధించినదే. ఇది ఎక్కువగా మహిళలలో వస్తుంది. తాత్కాలికంగా గుండె కండరం బలహీనపడి రక్తనాళాలు సాధారణంగా స్పందించలేవు. ఈ వ్యాధిని గతంలో టరోట్సుబో కార్డియోమయోపతీ అని పిలిచేవారు. అయితే ఇపుడు దీనిని ఒత్తిడి గుండెనొప్పి లేదా ఎపికల్ బెలూన్ సిండ్రోమ్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ రకమైన గుండె జబ్బు, ప్రత్యేకించి మహిళలకు అధిక ఒత్తిడి లేదా విచారకర సంఘటనలతో అంటే భాగస్వామి చనిపోవటం, భయం గొలిపే వైద్య నిర్ధారణలు, సొమ్ము పోగొట్టుకొనటం లేదా ఒత్తిడి వంటి ఇతర మానసిక కారణాలుగా వస్తుంది.
అయితే ఇంతవరకు దీనికి ఖచ్చితమైన కారణం కనుగొనలేదు. ఈ జబ్బు లక్షణాలు గుండెపోటు లో వలెనే వుంటాయి. ఛాతీ నొప్పి, శ్వాస కష్టమవటం, గుండె బలహీనపడి వేగంగా కొట్టుకోవడం. అయితే, కరోనరీ ఆర్టరీలలో శాశ్వత డ్యామేజి వుండదు. కనుక రోగులు కొద్ది వారాలలో కోలుకుంటారు. ఇదే గుండె పోటుకు దీనికి వ్యత్యాసం అని చెప్పాలి.
ఈ జబ్బును గురించిన పరిశోధనా ఫలితాలు ఆన్ లైన్ లో ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో నవంబర్ 23, 2010 లో ప్రచురించారు. ఇంతవరకు బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ కు తగిన వైద్యం కనుకొనబడలేదు. అయితే, దీని నివారణకుగాను లేదా గుండె కు హాని కలుగకుండా మహిళలు వారి ఒత్తిడి స్ధాయిని నియంత్రించుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.