హిందూ పురాణాల ప్రకారం, శ్రీ హరి సమస్త విశ్వాన్ని నియంత్రించే అత్యున్నత శక్తిని కలవాడు. అందుకే తనను విశ్వానికి రక్షకుడిగా పిలుస్తారు. మనం నిత్యం చూసే విష్ణువు ఫోటోలు, వీడియోల్లో శ్రీ మహా విష్ణువుకు నాలుగు చేతులు ఉంటాయని మనకు తెలుసు. అందులో కుడి చేతిలో పై భాగంలో పద్మం(కమలం), మరో చేతిలో గద(కౌమోదకి), ఎగువ ఎడమ చేతిలో శంఖం ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా మరో చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. ఈ చక్రానికి విష్ణుమూర్తి ఎనిమిదో అవతారమైన గోపాలునికి అవినాభవ సంబంధం ఉంది. ఈ సందర్భంగా విష్ణువు చేతికి అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రం ఎలా వచ్చింది.. తనకు ఈ చక్రాన్ని ఎవరిచ్చారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ పురాణాల ప్రకారం, కార్తీక మాసం శుక్ల చతుర్దశి తిథి రోజున శ్రీ మహా విష్ణువు శివయ్యను పూజించేందుకు ఓసారి కాశీకి వెళ్లాడు. అక్కడ మణికర్ణికా ఘాట్‌లో స్నానం చేసిన తర్వాత, వెయ్యి బంగారు తామరపువ్వులతో శివుడిని పూజిస్తానని మొక్కుకున్నాడు. అయితో సంప్రోక్షణ తర్వాత విష్ణువు పూజను ప్రారంభించే వేళ శివయ్య తన భక్తిని పరీక్షించాడు. ఆ సమయంలో ఒక తామరపువ్వును తగ్గించాడు. విష్ణువు తాను మొక్కుకున్నట్టు వెయ్యి తామర పువ్వులను శివుడికి సమర్పించాల్సి వచ్చింది. అయితే ఒకటి తక్కువైన సందర్భంలో తన కళ్లు తామరపువ్వును పోలి ఉందని భావించాడు. అందుకే తనను కమలనయన, పుండరీకాక్ష అని కూడా పిలుస్తారు. అదే సమయంలో తామర పువ్వు స్థానంలో తన కళ్లను సమర్పించాలని నిర్ణయించుకుంటాడు. తన కళ్లను శివయ్యకు సమర్పించడానికి సిద్దపడేలోపు శివుడు తన ముందు ప్రత్యక్షమై ఇలా అన్నాడు.. ఓ హరి.. విశ్వంలో నీలాంటి భక్తుడు లేడు. ఆ సమయంలో శివుడు శ్రీ హరికి సుదర్శన చక్రాన్ని సమర్పించి, ఈ చక్రం రాక్షసులను నాశనం చేస్తుందని, మూడులోకాల్లో ఇది సాటిలేని ఆయుధమని చెప్పాడు. అంతేకాదు ఆరోజున విష్ణువును పూజించిన వారికి వైకుంఠ లోక ప్రాప్తి లభిస్తుందని వరమిచ్చాడు.
శ్రీ మహా విష్ణువు ధరించే ఆభరణాలు, ఆయుధాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. విష్ణువు నాలుగు చేతులు జీవితంలోని నాలుగు దశలను సూచిస్తాయని పురాణాలలో పేర్కొనబడింది. అందులో మొదటిది జ్ఞాన సాధన, రెండోది కుటుంబ జీవితం, మూడోది వనవాసం, నాలుగోది లోకాన్ని త్యజించడం. అలాగే తన రెండు చెవిపోగులు జ్ఞానం, అజ్ఞానం, ఆనందం, దుఃఖం రెండు వ్యతిరేక విషయాల కలయికను సూచిస్తాయి. శ్రీ మహా విష్ణువు శేష నాగ పడగపై శయనించి ఉండటం మనం చాలా దేవాలయాల్లో చూస్తుంటాం. ఇలా ఉండటం అంటే ఒక వ్యక్తి సుఖం, దుఃఖం అన్నీ ఒకేసారి ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు. అంటే జీవితం ఆనందంతో పాటు బాధను అనుభవించే వ్యక్తి ద్వారా బ్యాలెన్స్ అవుతుంది. అందుకే పాములపై పడుకుని నవ్వుతూ జీవిత సత్యాన్ని బోధిస్తాడు శ్రీ విష్ణువు.