ఆ ఊర్లో పిల్లల్ని కనడం నిషేధం. నెలలు నిండేవరకు ఆ గ్రామంలో ఉండే గర్భిణీలు ప్రసవం సమయానికి పక్క గ్రామానికి వెళ్తారు. ఆ ఉర్లో నివసిస్తున్నవారెవరూ కూడా ఆ ఊర్లో పుట్టినవారు కాదు. ఇదెక్కడి ఆచారం అనుకుంటున్నారా… అయితే ఈ స్టోరి చదవాల్సిందే…. ఘనాలోని మాఫిదోవ్ గ్రామంలో ఓ వింత ఆచారం ఉంది. అక్కడ మూఢ నమ్మకాలు చిన్నారుల జననాన్ని కూడా శాసిస్తున్నాయి. ఒక్క ప్రసవాల్లోనే కాదు…. మరిన్ని ఆచారాలు ఆ గ్రామాల ప్రజలను పీడిస్తున్నాయి. ఆ గ్రామంలో జంతువుల పెంపకం కూడా నిషేధం. ఇక ఆ గ్రామంలో ఎవరైన చనిపోతే ఆ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించకూడదు. అలా చేయడాన్ని దైవద్రోహంగా పరిగణిస్తారు.
ఆ గ్రామంలోని పూర్వీకులకు ఓ అశరీరవాణి…. ఇది పవిత్ర క్షేత్రం, ఇక్కడ నివసించాలంటే కొన్ని నియమాలున్నాయి అని చెప్పిందట. ఇక్కడ ఎవరూ పిల్లల్ని కనకూడదు, జంతువులను పెంచకూడదు అదే విధంగా అంత్యక్రియలు నిర్వహించకూడదు అని కొన్ని నియమాలు పెట్టిందని గ్రామ పెద్దలు చెబుతారు.
గ్రామంలో ప్రసవించకూడదనే నియమంతో అక్కడి మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నియమం వల్ల పురుడు పోసుకోవడానికి చాలా దూరం నడవాలి. ఇక ప్రసవం సమయంలో అక్కడ ఎలాంటి వాహనం లేకపోతే ఆ మహిళల బాధ వర్ణణాతీతం. కొంత మంది కాన్పు సమయంలో పక్క ఊరిలోనే ఉంటున్నారు. ఈ ప్రాంతంలోని ఇతర గ్రామాల్లో ఈ నియమాలు పాటించడంలేదు, కానీ మాఫిదోవ్ గ్రామస్తులు మాత్రం పూర్వీకులు నుంచి వచ్చిన సాంప్రదాయాన్ని వదులుకునేందుకు ఇష్టపడడం లేదు.