టైప్ 2 డయాబెటీస్ వ్యాధి కేన్సర్ కూడా కలిగిస్తుందని పరిశోధన చెపుతోంది. అమెరికన్ కేన్సర్ అసోసియేషన్, అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ సంస్ధలు రెండూ కలిసి చేసిన ఒక స్టడీలో టైప్ 2 డయాబెటీస్ కొన్ని రకాల కేన్సర్ కలిగిస్తుందని డయాబెటీక్ రోగులకు మరింత విషమసమస్యగా వుంటుందని తేలింది. లివర్ కేన్సర్, కోలో రెక్టల్ కేన్సర్, బ్రెస్ట్ కేన్సర్, పానిక్రియాటిక్ కేన్సర్, బ్లాడర్ కేన్సర్ వంటివి వస్తాయని వెల్లడైంది.
ఈ వాస్తవాన్ని ఎదుర్కొనేందుకు పరిశోధకులు దీనికిగల కారణాలను, తగిన వైద్యాలను కనుగొనటంలో వున్నారు. మెట్ ఫార్మిన్ అనే మందు టైప్ 2 డయాబెటిక్ రోగులకు మంచిదని ఇది కేన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని కూడా వీరు పేర్కొంటున్నారు. అయితే, టైప్ 2 డయాబెటీస్ వున్నప్పటికి ఆరోగ్యకరమైన జీవన విధానం సాగించేవారికి కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా వుంటాయి.
కొవ్వు తగ్గించటమే లక్ష్యంగా వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం వుండాలి. డయాబెటీస్ వ్యాధి కలవారు తరచుగా వైద్యులను సంప్రదించడం, రక్తపరీక్షలు చేయించుకోవడం, కేన్సర్ వ్యాధి లక్షణాలు కనపడితే, తగినంత ముందుగా దానికి వైద్యం చేయడం వంటి వాటితో డయాబెటీక్ కేన్సర్ అరికట్టవచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు.