తెల్ల జుట్టు అనేది ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. కుర్రకారులో 90 శాతానికి పైగా మంది ఈ తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. తెల్ల జుట్టు సమస్యకు అనేక కారణాలు ఉంటాయని, అందుకు తగిన మోతాదులో పోషకాలు లేని ఆహారం ప్రధాన కారణంగా కనిపిస్తుందని, మరికొందరిలో వారి అలవాట్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్తున్నారు. కారణం ఏదైనా.. జుట్టుకు కావాల్సిన పోషకాలు అందకపోవడం వల్లే తెల్లబడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారు. ఈ తెల్లజుట్టును నల్లగా మార్చుకోవడం కోసం వీరు అనేక మార్గాలు ప్రయత్నిస్తుంటారు. మరికొందరు హెయిర్ కలర్స్ వేసి మెయింటెయిన్ చేస్తుంటారు. అప్పటికి కూడా అనేక రకాల రెమిడీస్‌ను కూడా ప్రయత్నిస్తుంటారు. రకరకాల మందులు కూడా వాడుతుంటారు.
కానీ వీటితో ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. దాంతో పాటుగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ మందులు వికటించి తీవ్ర రూపం దాలుస్తాయని, కొంతమందిలో భారీగా జుట్టు రాలిపోవడంతో పాటు ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీస్తాయి. దాంతో పులి పోయి భూతం పట్టినట్లు మారుతుంటుంది వారి పరిస్థితి. కాగా తెల్ల జుట్టుకు వీలైనంత వరకు హోమ్ రెమెడీస్ వినియోగించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వీటి ద్వారా వికటించే ప్రమాదం తగ్గడంతో పాటు దీర్ఘకాలిక పరిష్కారంగా ఇవి ఉపయోగపడతాయని వైద్యులు వివరిస్తున్నారు. మరి ఆ హోమ్ రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దామా.. నిమ్మరసం, కొబ్బరి నూనెను 4:1 నిష్పత్తిలో కలుపుకోవాలి. అంటే నాలుగు చెంచాల కొబ్బరి నూనెలో ఒక చెంచా నిమ్మరసం కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని జుట్టుకు కుదుళ్లకు పట్టేలా మర్దనా చేయాలి. ఒక గంట తర్వాత సాధారణ షాంపుతో తలస్నానం చేసేయాలి.
తెల్ల జుట్టు సమస్యకు ఉల్లిపాయ రసం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది జుట్టును పెరిగేలా కూడా చేస్తుంది. నాలుగు చెంచాల ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. అందులో ఒక చెంచా ఉల్లిపాయ రసం, ఒక స్పూన్ నిమ్మరసం కలుపుకోవాలి. ఆ మిక్స్‌ను తలకు బాగా పట్టించాలి. ఒక పది నిమిషాలు మసాజ్ చేసినట్లు చేసి ఆరనివ్వాలి. కనీసం గంట సమయం పాటు అలా ఉంచేసిన తర్వాత సాధారణ షాంపుతో తలస్నానం చేసేయాలి. ఇది జుట్టును నల్లబరచడంతో పాటు బలంగా కూడా మారుస్తుంది. అల్లం తురుము లేదా అల్లం రసం తీసుకుని, అందులో సరిపడా తేనె కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. ఆ తర్వాత 20 నుంచి 30 నిమిషాలు ఆరనిచ్చి తలస్నానం చేసేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి. అలా చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు చెప్తున్నారు.
బ్లాక్ టీ డికాషిన్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు బలానికి బాగా ఉపయోగపడతాయి. ఈ డికాషన్ జుట్టును నల్లగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందు కోసం ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకోవాలి. అందులో రెండు చెంచాల బ్లాక్ టీ పౌడర్, ఒక స్పూన్ ఉప్పు వేసి మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టుకోవాలి. ఆ నీరు చల్లబడిన తర్వాత జుట్టుకు బాగా పట్టించాలి. ఒక గంట తర్వాత తల స్నానం చేసేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం ద్వారా జుట్టును నల్లగా మార్చుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు.