కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియ (37)కు యెమెన్‌లో అక్కడి సుప్రీమ్ జ్యుడిషియల కౌన్సిల్ ఉరిశిక్షను విధించింది. ఓ వ్యక్తి హత్య కేసులో ఆమె దోషిగా తేలినందుకు గాను ఆమెకు న్యాయమూర్తి ఉరిశిక్షను ఖరారు చేశారు. ఈ క్రమంలోనే జూలై 16వ తేదీన ఆమెను ఉరి తీయనున్నట్లు ప్రకటించారు. కేరళలోని పాలక్కడ్ జిల్లాకు చెందిన ప్రియ 2011లో యెమెన్ రాజధాని సనకు భార్య, కుమార్తెతో కలిసి వెళ్లింది. అయితే ముగ్గురు అక్కడ జీవించడం కష్టంగా మారడంతో ప్రియ మాత్రమే అక్కడ ఉద్యోగం చేయడం ప్రారంభించింది. 2014లో భర్త, కుమార్తె స్వదేశానికి తిరిగి వచ్చారు.
కాగా అప్పట్లోనే స్థానికుడు అయిన తలాల్ అనే వ్యక్తితో కలిసి ప్రియ అదే ప్రాంతంలో ఓ క్లినిక్‌ను ఏర్పాటు చేసింది. అయితే తన పాస్‌పోర్టును తీసుకుని ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియ తలాల్‌కు మత్తు ఇచ్చి తన పాస్‌పోర్టును తీసుకోవాలనుకుంది. దీంతో అతనికి ఆమె డ్రగ్స్ ఇచ్చింది. అయితే ఆ డ్రగ్స్ మోతాదు మించడంతో తలాల్ మృతి చెందాడు. దీంతో ఆమె అతని మృతదేహాన్ని వాటర్ ట్యాంక్‌లో పడేసింది. ఇందుకు మరికొందరి సహకారం తీసుకుంది.
ఈ క్రమంలోనే ఈ కేసును విచారణ చేసిన న్యాయస్థానం 2017లోనే ఆమెను దోషిగా ప్రకటించింది. అయితే పూర్తి విచారణ అనంతరం తాజాగా ఆమెకు మరణ శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. దీన్ని యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్-అలిమి ధ్రువీకరించారు. దీంతో జూలై 16వ తేదీన ప్రియను ఉరి తీయనున్నట్లు తెలిపారు. అయితే యెమెన్ అధికారులతోపాటు బాధిత కుటుంబంతోనూ ఈ విషయంపై చర్చలు జరుపుతున్నామని సామాజిక కార్యకర్త శామ్యూల్ జెరోమ్ బాస్కరన్ వెల్లడించారు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆమెకు పడే శిక్షను తగ్గిస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.