ఏ రంగంలో వ్యాపారం చేసేవారు రాణించాలన్నా కూడా కస్టమర్లకు అత్యంత నాణ్యమైన సేవలను అందించాలి. అందులోనూ ఆహార రంగంలో అయితే ఇంకా చాలా ఎక్కువ నాణ్యంగా సేవలు ఉండాలి. దీనికి తోడు పేద, మధ్య తరగతి వర్గాలను కూడా దృష్టిలో ఉంచుకుని హోటల్ నిర్వహించాలి. అలా అయితేనే సక్సెస్ అవుతారు. ఆ సోదరులు కూడా సరిగ్గా ఇలాగే చేశారు. తండ్రి ప్రారంభించిన ధాబాను వారు ఒక సామ్రాజ్యంలా విస్తరించారు. అంతే కాదు, అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలను కూడా చూరగొంటున్నారు. ఇంతకీ వారు ఎవరు.. వారి ధాబా ఏమిటి.. వారు ఏం చేశారు..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హర్యానాలోని ముర్తల్ అనే ప్రాంతంలో ఉన్న గ్రాండ్ ట్రంక్ రోడ్డులో అమ్రిక్ సుఖ్‌దేవ్ ధాబా ఉంది. దీనికి ఎన్నో సంవత్సరాల చరిత్ర కూడా ఉంది. 1956లో సర్దార్ ప్రకాష్ సింగ్ అనే వ్యక్తి ఈ ధాబాను తొలుత ట్రక్కు, లారీ డ్రైవర్ల కోసం ప్రారంభించాడు. దాన్ని ఆయన ఎన్నో సంవత్సరాలు విజయవంతంగా నిర్వహించారు. 1990లలో ఆయన కుమారులు అమ్రిక్ సింగ్, సుఖ్‌దేవ్ సింగ్‌లు ధాబా బాధ్యతలను తీసుకుని తమ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించారు. ఇక వారి వ్యాపార రహస్యం ఏమిటంటే.. ఫుడ్‌ను అత్యంత నాణ్యంగా అందించడం. అలాగే ట్రక్కులు, లారీలు, కార్ల డ్రైవర్లకు డిస్కౌంట్ ధరలకే ఆహారాన్ని అందించడం. దీంతో వారి ధాబా ఎంతో ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే వారు తమ ధాబాల ద్వారా ఏటా కొన్ని కోట్లను ఆర్జిస్తున్నారు.
అమ్రిక్ సుఖ్‌దేవ్ దాబా ద్వారా ఆ సోదరులు ఇద్దరు ఏడాదికి రూ.100 కోట్ల మేర ఆదాయం ఆర్జిస్తున్నట్లు వారిపై ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు చేసిన ఓ వ్లాగర్ తెలియజేశారు. ఆ రోడ్డులో వెళ్లేవారు కచ్చితంగా తమ ధాబాలో ఫుడ్‌ను రుచి చూస్తారని, ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాం కాబట్టి కేవలం తమ ధాబాలో తినేందుకే చాలా మంది వస్తున్నారని ఆ సోదరులు చెబుతున్నారు. డ్రైవర్ల కోసం తాము అందిస్తున్న డిస్కౌంట్ వల్లే ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నామని, వారికి తమ ధాబాలో అన్ని సదుపాయాలను ఎప్పటికీ కల్పిస్తామని వారు చెప్పారు. దీంతో వారు చేస్తున్న పనిని నెటిజన్లు భేష్ అని కొనియాడుతున్నారు.