శివుడు. త్రిమూర్తుల్లో ఒకరు. సృష్టి, స్థితి, లయ కారకుల్లో ఈయన చివరి వాడు. అంటే.. అన్నింటినీ తనలో లయం చేసుకుంటాడు (కలుపుకుంటాడు) అని అర్థం. ఇక శివున్ని భక్తులు బోళా శంకరుడు అని కూడా పిలుచుకుంటారు. ఎందుకంటే అడిగిన వెంటనే శివుడు వరాలిస్తాడని భక్తుల విశ్వాసం. అందులో భాగంగానే పురాణాల్లో చాలా మంది శివుడి కోసం తపస్సు చేసి వరాలు పొందారు. అయితే ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే… శివుడికి ఓ సోదరి కూడా ఉంది తెలుసా..? అవును, మీరు విన్నది కరెక్టే. శివుడికి చెల్లెలు ఉంది. ఆమె పేరు దేవీ అశావరి. ఆమె గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శివుడు పార్వతిని పెళ్లి చేసుకుని కైలాసానికి వచ్చాక అక్కడ ఆమె కాపురం పెట్టింది. అయితే అక్కడ అందరూ మగవారే ఉండేవారు. కానీ వారు అందరూ పార్వతిని సొంత చెల్లెలిలాగానే చూసుకున్నారు. ఆమెకు అన్ని సేవలు చేసేవారు. అయితే కైలాసంలో ఆడవారు ఉండకపోవడంతో ఆమెకు ఎవరైనా మహిళ తోడుగా ఉంటే బాగుండు అనిపించింది. దీంతో పార్వతి శివున్ని కోరగా అప్పుడు శివుడు తనలాగే ఉండే దేవీ అశావరిని సృష్టించాడు. దేవీ అశావరి శివుడిలాగే పులి చర్మం ధరించి ఉంటుంది. జుట్టు విరబోసుకుని ఉంటుంది. కాళ్లు పగిలి ఉంటాయి. అయినప్పటికీ పార్వతి సంతోషించి అశావరిని ఇంటికి తీసుకెళ్తుంది.
అయితే నిజానికి అశావరి వేషం ఏమీ బాగుండదు. అలా అని చెప్పి పార్వతి ఆమెను అందంగా తయారు చేస్తుంది. అయితే అశావరికి తిండి యావ ఎక్కువ. దీంతో పార్వతి కైలాసంలో ఉన్న ఆహారం మొత్తాన్ని ఆమెకు పెడుతుంది. అయినప్పటికీ అశావరి తృప్తి చెందదు. దీంతో పార్వతి విసిగిపోయి తన గోడును శివుడికి చెప్పుకుంటుంది. దీంతో శివుడు అశావరిని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి పంపిస్తాడు. ఇదీ శివుని సోదరి కథ. అయితే అప్పుడు పార్వతితో శివుడు అంటాడట… ఒకే గొడుగు కింద ఇద్దరు ఆడవాళ్లు ఎప్పటికీ ఇమడలేరు అని..! అందుకనే ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది అని అంటాడు శివుడు. ఇప్పటికీ కొన్ని ఇండ్లలో ఇలాగే ఉంటుంది లెండి..!