ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు నేటి తరుణంలో కామన్ అయిపోయాయి. ఎవరి చేతిలో చూసినా అవి దర్శనమిస్తున్నాయి. దీంతో వారు అనేక పనులు చక్కబెట్టుకుంటున్నారు. అది వేరే విషయం. అయితే స్మార్ట్‌ఫోన్ అన్నాక కేవలం మనం మాత్రమే వాడుతామా..? అంటే.. నలుగురితో ఉన్నప్పుడు, నలుగురిని కలిసినప్పుడు మన ఫోన్ ఒక్కోసారి ఎదుటి వారికి ఇవ్వాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు కొందరు ఫోన్ ఇచ్చేందుకు వెనుకాడతారు. తమ ఫోన్‌లో ఉన్న సమాచారాన్ని అవతలి వ్యక్తి చూస్తాడేమో, ఏదైనా జరుగుతుందేమో అని డౌట్ అన్నమాట. అందుకోసమే కొందరు సందేహిస్తూ తమ ఫోన్‌లను అవతలి వ్యక్తులకు ఇస్తారు. అయితే నిజానికి మీరు అలా సందేహిస్తూ ఫోన్ ను ఇవ్వాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఓ ఫీచర్ లభిస్తున్నది. దాన్ని ఆన్ చేసుకుంటే చాలు, మీరు ఫోన్‌ను అవతలి వ్యక్తులకు ఇచ్చినా వారు మీ సమాచారం చూడలేరు. అయితే ఇంతకీ ఆ ఫీచర్ ఏమిటి..? దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలంటే..!
ఆండ్రాయిడ్ ఫోన్లలో గెస్ట్‌మోడ్ అనే ఫీచర్ ఒకటి ఉంటుంది. దాన్ని ఎలా ఆన్ చేయాలంటే… ఫోన్‌లో పైన నోటిఫికేషన్ బార్‌ను కిందకు లాగాలి. అక్కడ మీకు బ్యాటరీ పర్సంటేజ్, సెట్టింగ్స్ ఐకాన్ పక్కన యూజర్ ఐకాన్ ఉంటుంది. దాని ఓపెన్ చేయాలి. కింద ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిల్లో ప్రస్తుతం ఫోన్ వాడుతున్న యూజర్ పేరు (మీ పేరు) ఉంటుంది. దాని పక్కనే గెస్ట్ అని ఉంటుంది. పక్కనే యాడ్ యూజర్ అని మరో ఆప్షన్ కనిపిస్తుంది. వీటిలో గెస్ట్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీంతో ఫోన్ ఆటోమేటిక్‌గా గెస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. ఇక ఆ తరువాత మీ ఫోన్‌ను ఎదుటి వారికి ఇచ్చినా వారు మీ ఫోన్‌లో ఉన్న ఫొటోలు, కాల్స్, ఎస్ఎంఎస్‌లు వంటి సమాచారం చూడలేదు. అవన్నీ ఖాళీగా కనిపిస్తాయి. అయితే ఎస్డీ కార్డు లో ఉన్న ఫొటోలు, వీడియోలు, ఇతర వివరాలు మాత్రం కనిపిస్తాయి.
పైన చెప్పిన గెస్ట్ మోడ్ ఫీచర్‌ను సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీ విభాగంలో యూజర్స్ అనే సెక్షన్‌లో కూడా యాక్సెస్ చేయవచ్చు. అయితే ఫోన్లను బట్టి గెస్ట్ మోడ్ ఫీచర్ లొకేషన్ మారుతూ ఉంటుంది. కొన్ని ఫోన్లలో ఈ ఫీచర్ ఉండకపోవచ్చు కూడా. ఇక గెస్ట్ మోడ్‌లో ఉన్న వారు దాన్ని డీయాక్టివేట్ చేసుకుని నార్మల్ యూజర్‌లా ఫోన్‌ను వాడవచ్చు కదా.. అని మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది. అయితే అది సాధ్యపడదు. ఎందుకంటే అలా చేయాలంటే మీరు అంతకు ముందు ఫోన్‌కు పెట్టుకున్న ప్యాట్రన్ లేదా పిన్, పాస్‌వర్డ్ లాక్‌ను అడుగుతుంది. అది మీకే తెలుసు, ఎదుటి వారికి తెలియదు. కనుక వారు గెస్ట్ మోడ్‌ను డీయాక్టివేట్ చేసేందుకు అవకాశం ఉండదు. ఇక వారి నుంచి ఫోన్ తీసుకుని మళ్లీ పైన చెప్పినట్టుగానే ఆప్షన్స్‌లోకి వెళ్లి గెస్ట్‌పై టచ్ చేసి రిమూవ్ గెస్ట్ అని కనిపించే ఆప్షన్‌ను ఎంచుకుంటే చాలు, గెస్ట్ మోడ్ ఆఫ్ అవుతుంది. అప్పుడు మీరు పాస్‌వర్డ్, పిన్, ప్యాట్రన్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంతో గెస్ట్ మోడ్ నుంచి బయట పడవచ్చు..! తెలుసుకున్నారు కదా… ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే గెస్ట్ మోడ్ గురించి. కనుక ఇకపై మీరు ఫోన్‌ను ఎవరికైనా ఇవ్వాలనుకుంటే గెస్ట్ మోడ్‌ను ఆన్ చేసి నిర్భయంగా వారికి ఫోన్‌ను ఇవ్వవచ్చు..!