నిజానికి జీడి పప్పు కోసమే జీడిమామిడి చెట్లు పెంచుతారు. జీడిగింజ ప్రాసెస్ చేయటం పెద్ద పనే. జీడిమామిడి పండు తినడానికి రుచిగా ఉంటుంది. దీని రసం పలుచగా ఉంటుంది. ఇది ఎక్కువ తీపి, కొద్దిపాటి పులుపు, కొంత వగరు మిశ్రమంగా ఉంటుంది. అయితే ఇది అందరికీ పడదు. కారణం ఇందులో ఉన్న నుస. ఇది తిన్నాక గొంతులో గరగర మొదలవుతుంది. దగ్గు కూడా వచ్చే అవకాశం ఉంది. దీన్ని రసం, సాంబారు, కూరల్లో ఉపయోగిస్తారు.
జీడిమామిడి పండును నిలువుగా నాలుగు ముక్కలుగా కోసుకోవాలి. ముందుగా పోపు సిద్ధం చేసుకుని, అందులో నీరు పోయాలి. కొద్దిపాటి చింతపండు రసం, తగినంత బెల్లం కలిపి, అందులో జీడిమామిడి పండు ముక్కలు వేసి మరగబెట్టాలి.
అలాగే సాంబారులో కూడా జీడిమామిడి పండు ముక్కలు వేసుకోవచ్చు. వంకాయ కూరలో కూడా ఈ పండు ముక్కలు కలుపుకుంటే రుచిగా ఉంటుంది. సాధారణంగా రైతులు ఈ పండ్లను ఉపయోగించుకోరు. సంచార వ్యాపారులు వాటిని సేకరించి, పట్టణాల్లో, నగరాల్లో అమ్ముతున్నారు.