ఈ సీజన్‌లో మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బయటకు వెళ్లే వారైనా, ఇంట్లో ఉండే వారైనా సరే తప్పనిసరిగా తమ డైట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వారు చెబుతున్న జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి. ఏదో ఒకటి కడుపులో పడ్డాకే కాలు బయట పెట్టాలి. లేదంటే నీరసించిపోతాం. ఆకలి మందగిస్తుంది. ఫలితంగా, పోషక విలువల లోపం ఏర్పడుతుంది. మంచి భోజనం, పండ్లూ కూరగాయల ముక్కలూ శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.
మద్యం, కాఫీ, టీ, ధూమపానం… ఒంట్లోని నీటి నిల్వల్ని అడుగంటేలా చేస్తాయి. ఈ కాలంలో వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. మసాలా రుచులు ఎంత తగ్గిస్తే అంత మంచిది. వేపుడు కూరలూ సమోసాలూ మిర్చీబజ్జీలను ఆమడ దూరంలో ఉంచాలి. అవేకాదు, కొవ్వు ఎక్కువగా ఉన్న ఏ పదార్థమైనా దూరం పెట్టాలి. ఎందుకంటే, వేడి అనేది కొవ్వుపై చెడు ప్రభావం చూపుతుంది. పాలకూర, కీరా, అల్లం, వెల్లుల్లి, బీట్రూట్ వంటివి శక్తినిస్తాయి. నీరు అధికంగా ఉండే సొరకాయ, టమాటా, దోసకాయ, పుచ్చకాయ ఎక్కువగా తీసుకోవాలి.
సొరకాయ అరికాళ్లకు రుద్దుకుంటే వేడి తగ్గిపోతుందనీ, మొహం మీద కీర దోసకాయ ముక్కలు పెట్టుకుంటే చలువనిస్తుందనీ, నుదుటి మీద మంచిగంధం రాసుకుంటే హాయిహాయిగా ఉంటుందనీ, రోజ్ వాటర్ ని రిఫ్రిజిరేటర్ ఐస్ ట్రే లో పెట్టేసి ఆ ముక్కలతో ఒళ్లంతా రుద్దుకుంటే ఆనందమే ఆనందమనీ… చాలా చిట్కాలే ప్రచారంలో ఉన్నాయి. వీటి వల్ల చాలా సమస్యలకు పరిపూర్ణ పరిష్కారం దొరుకుతుంది. కొంత ఉపశమనం లభిస్తుంది.