కాలం గడిచే కొలది డయాబెటీస్ సమస్య బ్లడ్ షుగర్ మాత్రమే కాదని తెలుసుకుంటున్నాము. టైప్ 2 డయాబెటీస్ అనేది రక్తపోటు, అధిక కొల్లెస్టరాల్, అధికబరువు, బ్రెయిన్, హార్టులలో రక్త సరఫరా సమస్యలతో కూడిన ఒక క్లిష్టమైన వ్యాధి. అన్నీ వచ్చేసిన తర్వాత అవి డయాబెటీస్ కారణంగా వచ్చాయని కూడా తెలుస్తుంది. షుగర్ నియంత్రణ వలెనే, రక్తపోటు నియంత్రణ కూడా చేసుకోవాలి. తరచుగా మీ డాక్టర్ ను రక్తపోటు కూడా చెక్ చేయమని అడగండి. డయాబెటీస్ వున్న వారిలో రక్తపోటు 130/80 ఎం ఎం ఆఫ్ హెచ్జి లేదా తక్కువ గా వుండాలి.
బ్లడ్ కొలెస్టరాల్ అంటే రక్తంలోని కొవ్వు కూడా చెక్ చేయాలి. అధికమైతే దీనిని నివారించుకోవాలి. డయాబెటీస్ పై అధిక బరువు ప్రభావం చూపిస్తుంది. బరువు అధికమైతే మన శరీరం లోని ఇన్సులిన్ సాధారణంగా పని చేయలేదు. వెయిట్ తగ్గితే ఇన్సులిన్ పని చేస్తుంది. అందుకే వ్యాయామం చేయాలి. ఆహారాన్ని నియంత్రించాలి. బరువు తగ్గటం అంత తేలికైన పని కాదు. అయినప్పటికి బరువు తగ్గాలని మన పిల్లలకు చెపుతూండాలి.
అధిక బరువు సమస్య పాశ్చాత్య దేశాలలో అధికంగా వుంది. భారతదేశంలో కూడా ప్రధాన నగరాలలో ప్రజలు ఈ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారు. అధిక బరువు, డయాబెటీస్ లు రెండూ తోడై గుండె జబ్బులకు కూడా దోవతీస్తున్నాయి. కనుక అధిక బరువును అరికట్టటానికి తగిన చర్యలైన ఆహార నియంత్రణ, వ్యాయామాలు తప్పని సరిగా చేసి ఆరోగ్య పరిస్ధితిని మెరుగు పరచుకోవాలి.