బాగా లోతుగా ఉన్న బావులను, లోయలను చూస్తే కొందరికి భయం… సముద్రాలు, నదుల్లో ఉండే నీరంటే కొందరికి భయం… ఎత్తయిన భవంతుల నుంచి కిందకి చూడడమంటే ఇంకా కొందరికి భయం… బల్లులు, బొద్దింకలు, పాములు, కప్పలు… అంటే మరికొందరికి భయం. ఇలా భయాలనేవి రక రకాలుగా ఉంటాయి. ఒకరికి ఉన్న భయం మరొకరికి ఉండకపోవచ్చు. అయితే కొన్ని రకాల వింతైన భయాలు మాత్రం కొందరిలో ఉంటాయట. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. Sciaphobia.. ఈ ఫోబియా (భయం) ఉన్నవారికి నీడలంటే భయం. అది ఎంతగా అంటే తమ నీడను చూసి తామే భయపడుతారు. అలాంటి భయం వీరికి ఉంటుంది. Ecclesiaphobia.. ఈ ఫోబియా ఉన్న వారికి చర్చిలంటే భయమట. వింతగా ఉంది కదా. అవును మరి. అలాంటి వ్యక్తులు కూడా చాలా మందే ఉంటారట. Pluviophobia.. వర్షం అంటే భయపడేవారికి ఈ ఫోబియా ఉంటుంది. నిజానికి వర్షమంటే చాలా మందికి ఇష్టమే. కానీ దాని పట్ల భయపడేవారు కూడా ఉంటారట.
Gerascophobia.. వయస్సు మీద పడడం కారణంగా వృద్ధులు అవడం సహజమే. అయితే కొందరికి తాము వృద్ధులమవుతున్నామని లోలోపల భయం ఉంటుందట. దీన్ని ఈ ఫోబియాతో పిలుస్తారు. Amathophobia.. ఈ ఫోబియా ఉన్నవారికి దుమ్ము, ధూళి అంటే భయం ఉంటుంది. అలాంటి వారు దుమ్ము, ధూళిలో అస్సలు ఉండలేరట. తిరగలేరట. Glossophobia.. ఈ భయం చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది బహిరంగ ప్రదేశాల్లో లేదంటే సభాముఖంగా, సమావేశాల్లో మాట్లాడాలంటే భయపడుతారు కదా. అదే ఈ ఫోబియా. Dendrophobia.. ఈ ప్రపంచంలో చెట్లంటే భయపడే వారు కూడా ఉంటారట. అలాంటి వారికి ఉన్న ఫోబియాను ఇలా పిలుస్తారు. Xanthphobia.. పసుపు రంగు అంటే భయపడేవారికి ఈ ఫోబియా ఉంటుంది. అవును మరి. రంగులన్నా కొందరిలో భయం కలుగుతుందట.
Oneirophobia.. ఈ ఫోబియా ఉన్నవారికి కలలు అంటే చాలా భయమట. ఏవైనా పీడకలలు వస్తాయేమోనని వీరు తరచూ భయపడుతారట. Teratophobia.. ఈ ఫోబియా ఉన్నవారికి రాక్షసులు అంటే చాలా భయంగా ఉంటుందట. కనీసం సినిమాలు, పుస్తకాలు లాంటి మాధ్యమాల్లో రాక్షసుల బొమ్మలు కనబడినా వీరు భయపడుతారట. Amaxophobia.. వాహనాల్లో ప్రయాణించడం అంటే కొందరికి భయంగా ఉంటుంది. ఎక్కడైనా ప్రమాదం జరిగి చనిపోతామేమోనని అలాంటి వారు భయపడుతారు. దాన్ని ఈ ఫోబియాతో పిలుస్తారు. Taphephobia.. ఈ ఫోబియా ఉన్నవారికి బతికుండానే పూడ్చేస్తారేమోనని విపరీతంగా భయం కలుగుతుందట. Clinophobia.. ఈ ఫోబియా ఉన్న వారికి సర్కస్‌లలో ఉండే జోకర్లు అంటే భయం ఉంటుందట. అదేం విచిత్రమో. వారిని చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది కానీ భయం కలుగుతుందా. Eremiophobia.. ఒంటరింగా ఉంటే కొందరు భయపడతారు కదా. అలాంటి వారికి ఉన్న ఫోబియానే ఇది.
Gephyrophobia.. ఈ ఫోబియా ఉన్నవారికి పొడవైన వంతెనలంటే చాలా భయం కలుగుతుందట. పొరపాటున వాటిలో పడతామేమోనని వారు భయం చెందుతారట. Katagelophobia.. ఎదుటి వారు హేళన చేస్తారేమోనని కొందరు భయపడుతారట. అలాంటి వారికి ఉన్న ఫోబియానే ఇది. Euphobia.. ఇది చాలా చిత్రమైంది చూడండి. సాధారణంగా ఎవరూ కూడా చెడు వార్తలు వినాలనుకోరు, మంచి వార్తలే వినాలనుకుంటారు. కానీ కొందరికి మాత్రం మంచి వార్తలంటేనే విపరీతమైన భయం కలుగుతుందట. అలాంటి వారికి ఉండే ఫోబియానే ఇది. Eurotophobia.. స్త్రీల జననావయవాలంటే కొందరు పురుషులకు భయం ఉంటుందట. ఆ ఫోబియానే ఇది. Pogonophobia.. ఈ ఫోబియా ఉన్నవారికి గడ్డమంటే భయమట. ఎక్కడ గడ్డం చూసినా భయం చెందుతారట. Tocophobia.. ఈ ఫోబియా మహిళల్లో ఉంటుంది. పిల్లలు జన్మించే సమయంలో కలిగే నొప్పి, బాధ అనుభవించాల్సి వస్తుందేమోనని చాలా మంది మహిళలు ఈ ఫోబియాకు లోనవుతారట.