మహాభారత యుద్దం 18 రోజులు జరిగింది. 13వ రోజున అభిమన్యుడు యుద్ధంలో మరణించాడు. సైనికులు అంతా తామర పువ్వులో రేకులవలె నిలుస్తారు ..అందుకే పద్మవ్యూహం అంటారు. ఏడు వలయాలు ఉంటాయి. రధ, గజ, తురగ, పదాతి దళాలతో నిండి ఉంటాయి. ఈ వ్యూహంలో లోపలికి ప్రవేశించి ఒకరిని చంపితే మరొకరు ఆ స్థానంలోకి జరుగుతారు..ఆవిధంగా ఎక్కడా కూడా సందు రానివ్వరు.. చక్రాకారంలో సైనికులు ఒకరి స్థానంలోకి ఇంకొకరు..అలా కదులుతూనే ఉంటారు. అంటే ఎప్పటికప్పుడు కొత్తవానితో యుద్ధం చేయాలి. ఆ క్రమంలో ఎంతటి వీరుడయినా దారంతా అందరినీ ఎదుర్కొలేక శక్తిహీనుడిగా మారిపోతారు.. లోపలికి పోవటానికి మాత్రమే మార్గం ఉంటుంది. అలా లోలోపలికి లోపలి అంతర వృత్తం(కేసరి భాగం) లోకి నెట్టబడతారు. దానితో లోపలి నుంచి బయటికి రావటం అసాధ్యం.
అభిమన్యుడు ఎన్నుకున్నది ..సరాసరి వేగంగా లోపలికి వెళుతూ దారి చేస్తూ పోతే ..ఆ దారిలో పెదనాన్నలు లోపలికి వెనువెంటనే ప్రవేశించటం. తరువాత, అదే వేగంతో వెనక్కు నరుక్కుంటూ రావటం.. అని.. అసలు పద్మవ్యూహం ఎందుకు పన్నవలిసివచ్చింది? కౌరవుల మొదటి సర్వ సైన్యాధ్యక్షుడు – భీష్ముల వారు. రెండోవ సర్వ సైన్యాధ్యక్షుడు – ద్రోణాచార్యుడు. ఆతరువాత ఆయన సారధ్యంలో మరో రెండు రోజులపాటు యుద్ధం జరిగినా కూడా ధర్మరాజుని బంధించలేకపోయారని దుర్యోధనుడు ఆయనని తూలనాడతాడు. దానితో ద్రోణుడు ఓ అభేద్యమయిన వ్యూహాన్ని నిర్మించి ధర్మరాజుని బంధించుతాను అని దుర్యోధనుడుకి మాట ఇస్తాడు — అదే పద్మవ్యూహం.
పద్మవ్యూహం వ్యూహంలో ఎవరు ఎక్కడ? ద్రోణుడు – పద్మం అంతర భాగంలో. కౌరవ సామంత రాజులు – తామర పువ్వు రేకుల్లాగా, వాళ్ళ పిల్లలు సైన్యం పువ్వు కేసరి(మధ్య భాగం) లాగ నిలబడ్డారు. కర్ణుడూ, దుశ్శాసనుడు – పద్మం లోపలి వైపు ..వారికీ అభిముఖంగా దుర్యోధనుడు సర్వ సైన్యంతో నిలిచారు. సైంధవుడు(జయద్రధుడు- కౌరవుల బావమరిది) – మొదలులో ఉన్నాడు. అశ్వత్థామా, శకుని, కృపాచార్యుడు, భూరిశ్రవుడు, కృతవర్మ, శలుడు, శల్యుడు, మిగిలిన కౌరవులు వాళ్ళ సంతానం -చుట్టూరా వృత్తాలలో ఉన్నారు.