తరగతి గదిలో యాభై మంది విద్యార్థులు ఉన్నారు. టీచర్ లేరని తెగ గోల చేస్తున్నారు. అలాంటి శబ్దం జ్ఞాపకం ఉందా! రోడ్డు మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ రొదను వింటారా? స్టేడియంలో ప్రేక్షకుల అరుపులు, పక్షుల కిల కిలలు. కర్మాగారాలు, రైలు, విమానం శబ్దాలు. మీరు, నేను మాట్లాడేది. నదులు, సముద్రాలు, హోరున వీచే గాలి. ఈ శబ్దాలు ఇప్పుడు గుర్తుచేసుకోగలుగుతారా! ఇలాంటి శబ్దాలన్నీ కలిపితే భూమి మొత్తం శబ్దం అనుకోవచ్చు.
ఈ మొత్తం శబ్దాలన్నీ వాతావరణంలో పైకి వెళ్లేకొద్దీ క్షీణించిపోతాయి. వాతావరణాన్ని దాటాక ఆపైన అంతరిక్షంలో ఎటువంటి యానకం లేదు. శబ్ద తరంగాలు ప్రయాణించడానికి యానకం కావాలి. యానకం లేనందున అంతరిక్షంలో ఎటువంటి శబ్దాలు వినిపించవు. ఇతర గ్రహాల్లో భూకంపాలు వచ్చినా భూమి మీద నేరుగా గుర్తించబడవు. ఇది ఎనిమిదో తరగతి ఫిజిక్సు. నాసా చెప్పాల్సిన అవసరం లేదు.
అంతరిక్షం పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుందా అంటే మన చెవులకి వినబడని శబ్దాలేవో నాసా వాళ్ళు కనుక్కున్నారట. ఇవి మాములు శబ్ద తరంగాల వంటి యాంత్రిక తరంగాలు కావు. ప్లాస్మా తరంగాలని విద్యుదయస్కాంత డోలనాల(Electromagnetic oscillations) వల్ల ఏర్పడే విచిత్ర శబ్దాలను నాసా అంతరిక్ష సాధనాలు గుర్తించాయి. ఈ శబ్దాలు తోడేళ్ల కూతల్లాగ, పక్షుల అరుపుల్లాగ, లేజర్ గన్ శబ్దల్లాగ వినిపిస్తున్నాయి.