వేసవి కాలం ఆరంభానికి ముందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలను పెంచిన విషయం విదితమే. వేసవిలో బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి కనుక ఈ విషయాన్ని ముందే గ్రహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలను పెంచేసింది. అయితే ఇప్పుడు వేసవి కాలం ముగుస్తుండడంతో ఇతర లిక్కర్ బ్రాండ్లపై కూడా ధరలను పెంచింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం మద్యం ప్రియులకు షాక్ ఇచ్చిందనే చెప్పవచ్చు. రాష్ట్రంలో మరోసారి మద్యం ధరలను పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను కూడా జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు మద్యం బ్రాండ్లకు చెందిన ఫుల్ బాటిల్స్‌పై రూ.40 పెంచారు. అదే హాఫ్ బాటిల్స్‌ను కొనుగోలు చేస్తే రూ.20 అదనంగా చెల్లించాలి. క్వార్టర్ సీసాలను కొంటే రూ.10 అదనంగా చెల్లించాలి. అయితే ఈ ధరల పెంపు వివరాలపై ఇంకా స్పష్టమైన ప్రకటన రావల్సి ఉంది. ఏదేమైనా మద్యం ధరలను గణనీయంగా పెంచుతుండడం మద్యం ప్రియులను షాక్‌కు గురి చేస్తుంది. ఏపీలోనూ మద్యం ధరలను బారీగా పెంచిన విషయం తెలిసిందే.