మీరు మీ దైనందిన జీవితంలో సంతోషంగానే ఉంటున్నారా..? అంటే, రోజు మొత్తం హుషారుగా, ఉత్సాహంగా గడుపుతూ హ్యాపీగానే లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారా..? లేదు కదూ..! నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో దాదాపుగా చాలా మంది హ్యాపీ లైఫ్‌ను గడపడం లేదు. బయటికి వెళ్తే పని ఒత్తిడి, ఇంటికి వస్తే అక్కడి ఉండే రెగ్యులర్ సమస్యలు… వెరసి సగటు పౌరులు ఎవరూ కూడా నేడు సంతోషకరమై జీవితం గడపడం లేదు. దీని కారణంగా ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు ఎక్కువై అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు. అయితే అలాంటి వారు కింద ఇచ్చిన పలు సూచనలను రోజూ 23 నిమిషాల పాటు పాటిస్తే దాంతో ఆ రోజంగా హ్యాపీగా ఉండవచ్చు. అంతేకాదు, ఎంత పని చేసినా ఒత్తిడి అనేది తెలియదు. టెన్షన్ ఫ్రీగా ఉండవచ్చు. దీన్ని ఓ మానసిక శాస్త్రవేత్త స్వయంగా పరిశోధించి చెప్పారు కూడా. ఇంతకీ మనం నిత్యం ఉదయాన్నే 23 నిమిషాలు పాటు చేయాల్సిన ఆ పనులేమిటంటే…
మీకు జీవితంలో ఎవరో ఒకరు కచ్చితంగా ఏదో ఒక సందర్భంలో హెల్ప్ చేసి ఉంటారు కదా. అలాంటి వారి గురించి 2 నిమిషాల పాటు ఏదైనా రాయండి. వారు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటూ కొన్ని మాటలు రాయండి. ఆ సహాయం మీకు ఎంత ఉపయోపడిందో కృతజ్ఞతా భావంతో రాయండి. 2 నిమిషాల్లో ఆ వాక్యాలను మీరు రాసేయండి. అంతకు ముందు రోజు జరిగిన ఏవైనా సంఘటనల్లో ఏదైనా ఒక పాజిటివ్ సంఘటనను, అంటే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా విజయవంతంగా జరిగిన సంఘటన గురించి 2 నిమిషాల్లో పలు వాక్యాలను రాయండి. నిత్యం 15 నిమిషాల పాటు వాకింగ్, జాగింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ వంటి కార్డియో ఎక్సర్‌సైజ్‌లను చేయండి. రోజూ 2 నిమిషాల పాటు కేవలం మీ శ్వాస పైనే ధ్యాస పెట్టి మెడిటేషన్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితుల పట్ల మీరు ఏవిధంగా ప్రవర్తిస్తారో, ఎంత దయగా ఉంటారో కొన్ని వాక్యాలను 2 నిమిషాల్లో రాయండి.
పైన చెప్పిన 5 పనులకు పట్టే సమయం లెక్కించారు కదా. 2 + 2 + 15 + 2 + 2 = 23 నిమిషాలు. ఈ పనులన్నింటినీ నిత్యం ఉదయాన్నే వరుసగా చేసేయండి. అందుకు మీరు వెచ్చించాల్సింది 23 నిమిషాలు. అంతే. ఇలా 21 రోజుల పాటు చేయండి. మీలో కచ్చితంగా పాజిటివ్ దృక్పథం వస్తుంది. టెన్షన్, ఆందోళన, ఒత్తిడి, ఇతర మానసిక సమస్యలు అన్నీ పోతాయి. రోజంతా హ్యాపీగా ఉంటారు కూడా. ఎంత పని చేసినా ఒత్తిడి కలగదు. పైన చెప్పిన నియమాన్ని షాన్ అకోర్ అనే మానసిక శాస్త్రవేత్త, రచయిత స్వయంగా పరిశోధించారు కూడా. కాబట్టి వాటిని మీరు వెంటనే ఆచరణలో పెట్టండి. తద్వారా రోజంతా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ గడపవచ్చు.