కాల్స్, ఎస్ఎంఎస్‌లు, ఇన్‌స్టంట్ మెసేజ్‌లు, పాటలు, సెల్ఫీలు, వీడియోలు, ఇంటర్నెట్, ఈ-మెయిల్… అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే మనం స్మార్ట్‌ఫోన్లతో చేస్తున్న పనులు అన్నీ ఇన్నీ కావు. నిజంగా అవి లేని ప్రపంచాన్ని నేడు మనం ఊహించలేం. అయితే మీరెప్పుడైనా ఫోన్ల డిజైన్ గురించి ఆలోచించిరా..? అదేనండీ, వాటి ఆకారం..! అవును,అదే. ఏముందీ, అన్నీ దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నాయి అంతే కదా, అనబోతున్నారా..? అయితే మీరు చెబుతోంది కరెక్టే. కానీ అవి అలానే ఎందుకు ఉన్నాయి..? వృత్తం లేదా త్రిభుజం లేదా ఏదైనా ఇంకో ఆకారంలో ఎందుకు లేవు..? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? లేదు కదూ..! అయితే అవి దీర్ఘ చతురస్రాకారంలోనే ఎందుకు ఉన్నాయో, దాని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
aspect-ratio3:2, 16:9 aspect ratio అని మీరు ఎక్కడైనా చదివారా..? చదివే ఉంటారు, కానీ వాటి గురించి అంతగా పట్టించుకుని ఉండరు. అయితే అవి నిజంగా ఎందుకంటే 3:2, 16:9 aspect ratio అంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ఓ డిజిటల్ స్క్రీన్ పిక్సల్స్‌కు అనుగుణంగా కనిపించే ప్రాంతం. ఇది వృత్తం, త్రిభుజం వంటి వేరే ఆకారాల్లో ఉంటే సరిగా బొమ్మ కనిపించదు. దీర్ఘ చతురస్రాకారంలో ఉంటేనే పిక్చర్, స్క్రీన్ బాగా కనిపిస్తుంది. అందుకే ఫోన్లను కూడా దీర్ఘ చతురస్రాకారంలోనే తయారు చేయడం మొదలు పెట్టారు. ఫోన్లు ఆ ఆకారంలో రావడానికి గల కారణాల్లో ఇదొకటి.
మీకు పిక్సల్స్ అంటే తెలుసుగా. చిన్నపాటి చుక్క దానికి అనువైన చతురస్రంలో పట్టే ప్రదేశం. అది మొత్తం చతురస్రాకారంలోనే స్క్వేర్ మాదిరిగా ఉంటుంది. పిక్సల్ అదే ఆకారంలో ఉంటుంది. ఈ క్రమంలో చతురస్రాకారంలో ఉండే పిక్సల్ దీర్ఘచతురస్రాకారంలో ఉండే స్క్రీన్‌లోనే సరిగ్గా ఇముడుతుంది. అంతేకానీ వృత్తంలో ఇమడదు. కొన్ని పిక్సల్స్ ఫ్రేమ్ బయటికి వచ్చేస్తాయి. వృత్తంలో కన్నా దీర్ఘచతురస్రాకారంలోనే పదాలు పూర్తిగా నిండుతాయి. అందుకే ఫోన్లను కూడా అదే ఆకారంలో తయారం చేయడం మొదలు పెట్టారు. ఇది ఆ ఆకారం రావడానికి గల మరో కారణం.
ఇక ఫోన్లు దీర్ఘ చతురస్రాకారంలోనే తయారు కావడానికి గల ఇంకో కారణమేమిటంటే వృత్తం లేదా త్రిభుజం వేటిని తీసుకున్నా వాటి చుట్టుకొలత చాలా తక్కువగా ఉంటుంది. అదే దీర్ఘ చతురస్రం అయితే చుట్టుకొలత ఎక్కువ వస్తుంది. అందుకే ఫోన్లను ఆ ఆకారంలో తయారు చేస్తున్నారు. అంతేకాదు, ఆ ఆకారంలో ఉన్న వస్తువులే చేతితో పట్టుకుంటానికి, జేబులో పెట్టుకుంటానికి అనువుగా ఉంటాయట. అవును మరి, ఫోన్‌నైతే జేబులో పెట్టగలం, కానీ వృత్తం ఆకారంలో ఉండే సీడీ లేదా డీవీడీని జేబులో పెట్టలేం కదా. అందుకే ఫోన్లను దీర్ఘ చతురస్రం ఆకారంలో తయారు చేస్తున్నారు. తెలుసుకున్నారుగా… ఫోన్ల ఆకారం అలాగే ఎందుకు వచ్చిందో..!