మైగ్రేన్ తలనొప్పి.. ఈ సమస్య కారణంగా బాధపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. మైగ్రేన్ తో బాధపడే వారికి తలలో ఒక వైపు తీవ్రంగా నొప్పి వస్తుంది. ఈ నొప్పి 72 గంటల వరకు ఉంటుంది. అలాగే ప్రతిరోజూ ఒకే సమయానికి నొప్పి ప్రారంభమై నొప్పి తీవ్రత ఎక్కువవుతూ ఉంటుంది. తలనొప్పితోపాటు వికారం, మెడ నొప్పి, కడుపులో మంట, అన్నం జీర్ణం అవ్వకపోవడం వంటి సమస్యలు కూడా బాధిస్తూ ఉంటాయి. ఎక్కువ కాంతిని చూడలేకపోవడం, చీకటిలో కూర్చోవాలనిపించడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి.
ఈ నొప్పి నుండి బయట పడడానికి ఆస్ప్రిన్ వంటి మందులను వాడినప్పటికీ కొన్నిసార్లు ప్రయోజనం ఉండదు. ఈ మైగ్రేన్ తలనొప్పి సమస్యను సాధారణ చిట్కాలను ఉపయోగించి మనం నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నప్పుడు ఒక ఆపిల్ ను తినడం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. నీటిలో అల్లాన్ని లేదా అల్లం పొడిని వేసి మరిగించాలి. ఈ నీటిని కొద్ది కొద్దిగా తీసుకోవడం వల్ల కూడా మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. అల్లంలో ఉండే ఔషధ గుణాలు తలనొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక వస్త్రంలో ఐస్ ముక్కలను వేసి నొప్పి ఉన్న ప్రదేశంలో సున్నితంగా మర్దనా చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.

మైగ్రేన్ నొప్పిని తగ్గించడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక గ్లాస్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, ఒక టీ స్పూన్ తేనెను వేసి కలిపి తీసుకోవడం వల్ల తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే తలనొప్పి బాధిస్తున్నప్పుడు తులసి ఆకులను తీసుకుని వాటిని వాసన చూడడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అలాగే తలనొప్పిని తగ్గించడంలో కాఫీ గింజలు కూడా మనకు ఉపయోగపడతాయి. మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతునప్పుడు ఒక కప్పు కాఫీని తాగడం వల్ల నొప్పి తీవ్రత కొంతమేర తగ్గుతుంది.
అలాగే మైగ్రేన్ సమస్యతో బాధపడే వారు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారాన్ని సూప్ ల రూపంలో తీసుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల మైగ్రేన్ సమస్య నుండి మనం ఉపశమనాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.











