నేటి తరుణంలో పెళ్లైన దంపతులు ఎదుర్కొంటున్న కీలక సమస్యల్లో సంతాన లేమి కూడా ఒకటి. ఇందుకు అనేక కారణాలు కూడా ఉంటున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగింది పొగ తాగడం. దీని వల్ల పిల్లలు పుట్టే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని పలువురు వైద్యులు చెబుతున్నారు. ఈ విషయాన్ని కొందరు పలు పరిశోధనల ద్వారా నిరూపించారు కూడా. దంపతుల్లో ఆడ, మగ ఎవరైనా పొగ తాగితే దాంతో పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుందని, ఒక వేళ పుట్టినా ఆ పిల్లలకు అనేక రకాల అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశం ఉంటుందని వారు అంటున్నారు.
పొగతాగే వారికి పిల్లలు పుట్టే అవకాశాలపై పలువురు బ్రెజిల్ పరిశోధకులు ఇటీవల పరిశోధనలు చేశారు. వారు 20 మంది పొగతాగేవారిని, 20 మంది పొగతాగని వారిని ఎంచుకుని అనంతరం వారిపై పరిశోధనలు చేశారు. ఆయా గ్రూపుల్లో ఉన్న ఆడ, మగ ఇద్దరినీ టెస్ట్ చేశారు. చివరికి తెలిసిందేమిటంటే… పొగతాగే మగవారిలో వీర్య కణాలు పూర్తిగా నాశనమవుతాయట. ఒక వేళ ఎంతో కొంత మొత్తంలో ఉన్నా వాటి వల్ల పిల్లలు పుట్టేందుకు అవకాశం తక్కువగా ఉంటుందట. అంతేకాకుండా పొగ తాగడం వల్ల మగవారి వీర్యంలో ఉండే ప్రోటామైన్ 1, ప్రోటామైన్ 2 అని పిలవబడే రెండు ముఖ్యమైన ప్రోటీన్లు క్రమంగా క్షీణించి వీర్య నాణ్యత తగ్గుతుందట. దీనికి తోడు అవి అండాన్ని చేరేందుకు కావల్సిన శక్తి కూడా వాటికి ఉండదట. కాగా పొగతాగే కొందరు మగవారిలో లైంగిక పటిమ కూడా తగ్గిపోతుందట.
ఇక పొగతాగని ఆడవారితో పోలిస్తే పొగ తాగే వారిలో అండం సరిగ్గా వృద్ధి చెందదట. దీనికి తోడు రుతుక్రమంలో మార్పులు ఏర్పడి వారు సంతానం పొందే అవకాశాలను ఇంకా కఠినతరం చేసుకుంటారట. అయితే పొగతాగే ఆడవారు ఒక వేళ గర్భం దాల్చి శిశువుకు జన్మనిస్తే ఆ శిశువులకు లుకేమియా వంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుందట. పొగ తాగడం వల్ల ఆడైనా, మగైనా వారి డీఎన్ఏలో మార్పులు వచ్చి అది బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందట. ఈ క్రమంలో సంతానం పొందాలనుకునే దంపతులు పొగ తాగడం మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతగా కావాలంటే మగవారైతే బిడ్డను కనాలనుకునే సమయానికి 3 నెలల ముందు వరకు పొగతాగడం మానేయాలని, అదే మహిళలైతే బిడ్డ జన్మించి, ఆ బిడ్డ పాలు మరిచేంత వరకు పొగతాగడం మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు.